ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో విషాదం..బిస్మిల్లా జన్‌ షిన్వారీ కన్నుమూత

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో విషాదం..బిస్మిల్లా జన్‌ షిన్వారీ కన్నుమూత

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ (Afghanistan Cricket)లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ (International Umpire) బిస్మిల్లా జన్‌ షిన్వారీ (Bismillah Jan Shinwari) 41 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) నేడు (జులై 8) ప్రకటించింది. షిన్వారీ మృతి పట్ల ఏసీబీ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆఫ్ఘన్ క్రికెట్ ఒక గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

షిన్వారీ కెరీర్ ప్రస్థానం
1984 మార్చిలో జన్మించిన షిన్వారీ, 2017 డిసెంబర్‌లో అంతర్జాతీయ అంపైరింగ్‌లోకి అరంగేట్రం చేశారు. ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో ఆయన అంపైరింగ్ ప్రయాణం మొదలైంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో చివరిసారిగా అంపైరింగ్ చేశారు. షిన్వారీ తన కెరీర్‌లో మొత్తం 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించారు.

బాంబు పేలుడు నుంచి బయటపడి..!
షిన్వారీ జీవితంలో 2020 అక్టోబర్‌లో జరిగిన ఒక సంఘటన ఆయనను వార్తల్లో నిలిపింది. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుడు నుంచి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ప్రాథమిక నివేదికల్లో షిన్వారీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను చనిపోలేదని ధృవీకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment