ఇటీవల బీజేపీ మహిళా నేతలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన సినీ నటి మాధవీలత తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేసింది. జేసీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా సినీ పరిశ్రమలోని మహిళల గౌరవానికి భంగం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
మాధవీలత, ‘మా’లో ఫిర్యాదు చేస్తూ, తనకే కాదు, తన కుటుంబసభ్యులను కూడా అవమానించేలా జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పరిశ్రమ మహిళల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయంటూ, జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సినిమారంగంలో మహిళలకు గౌరవాన్ని నిలుపుకోవడం ఎంత ముఖ్యమో మాధవీలత తేటతెల్లం చేశారు. ఈ తరహా అంశాలపై పరిశ్రమ గట్టిగా స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
తాడిపత్రిలో మహిళల కోసం న్యూఇయర్ ఈవెంట్ నిర్వహించడంపై మాధవీలత స్పందించారు. దీంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కారు. తరువాత క్షమాపణలు చెప్పినప్పటికీ నటి మాధవీలత మాత్రం ఆయన వ్యాఖ్యలపై ‘మా’కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.