టాలీవుడ్ సీనియర్ నటి హేమ పేరు మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది. కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా (Quack Arena) పబ్‌పై పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల సమయంలో హేమ అక్కడే ఉండటం సంచలనంగా మారింది. కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా పబ్‌లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ రైడ్ సమయంలో పోలీసులు అక్కడ ఉన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. నటి హేమకు మాత్రం ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు సమాచారం.
“మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు”
పబ్‌పై దాడి జరిగిన వెంటనే హేమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. “నేను ఎప్పుడూ తప్పు చేయను. నా డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. మీ హేమక్క ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. లవ్ యూ ఆల్” అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
పాత వివాదాల నీడ
గతంలో బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో కూడా హేమ పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేసి విచారించగా, ఆ తర్వాత ఆమెకు విముక్తి లభించింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పబ్ దాడుల్లో ఆమె పేరు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు పబ్ యాజమాన్యంపై మరియు పాజిటివ్ వచ్చిన 8 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. హేమకు నెగిటివ్ వచ్చినప్పటికీ, డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ప్రదేశంలో ఆమె ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








