ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిపల్లెలో జరిగింది. హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా మోహన్ బాబు యూనివర్సిటీకి చేరేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం యూనివర్సిటీలోకి ప్రవేశం అనుమతించలేమని పోలీసులు స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి నారావారిపల్లె వెళ్లి, మంత్రి లోకేశ్‌తో సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం, ఎ.రంగంపేట చేరుకుని జల్లికట్టు పండుగను వీక్షించారు. సాయంత్రం మోహన్‌బాబు యూనివర్సిటీకి వెళ్లి అక్కడున్న తన నానమ్మ, అమ్మమ్మ సమాధుల వద్ద నివాళులర్పించనున్నట్లు సమాచారం.
తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ యూనివర్సిటీలోకి వచ్చే అవకాశాన్ని గమనించి, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా గేట్లు మూసివేశారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.