తెలంగాణలో రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో కేటీఆర్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించారు.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈరోజు ఉదయం ఏసీబీ విచారణకు బయల్దేరిన సమయంలో కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. తన ఇంట్లో సోదాలు చేసి ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టి తనను ఇరికించే ప్రయత్నం చేస్తారని కేటీఆర్ అనుమానించినట్లుగానే.. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసం(Orion Villas)లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ చెప్పినట్టు సాయంత్రానికి ఏసీబీ అధికారుల బృందం ఆయన ఇంట్లో సోదాలు చేపట్టింది. సోదాల విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్న నేపథ్యంలో ఏసీబీ, ఈడీ వరుసగా నోటీసులు జారీ చేస్తున్నాయి. కాగా, ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్, తన లాయర్‌ను అనుమతించలేదని కారణంతో తిరిగి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వరుస నోటీసులు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఉత్కంఠను పెంచుతున్నాయి.