రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య భద్రతను అందించే ఆరోగ్యశ్రీ (Aarogyasri Scheme) పథకం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు (Network Hospitals), ఇవాల్టి (ఏప్రిల్ 7) నుంచి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (AP Specialty Hospitals Association) ఒక ప్రకటనలో పేర్కొంది.
కూటమి ప్రభుత్వం నుండి ఇప్పటికీ రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లింపులు జరగాల్సి ఉందని పేర్కొంది. ఈ కారణంగా ఆసుపత్రులపై ఆర్థిక భారం భారీగా పెరిగిందని, బకాయిల్లో కొంతమేర విడుదలైనప్పటికీ, ఆసుపత్రులు అందించిన సేవల విలువ దానికి మించి ఉందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించకపోతే, పథకాన్ని కొనసాగించడం అసాధ్యమని వారు తాజా లేఖలో వెల్లడించారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలకు తాత్కాలికంగా బ్రేక్ (Break) వేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ కానుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పేదలకు ఉచితంగా సేవలు అందించే పథకం నిలిచిపోకుండా నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ (Demand) చేస్తున్నారు. ప్రజలకు విపరీతంగా ఉపయోగపడే ఈ పథకం నిలిపివేత, వేలాది మంది రోగులకు చికిత్సలు నిలిచిపోవడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.