కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ నుండి మౌలిక వసతుల కల్పన వరకు ఆప్ ప్రభుత్వంలో వివిధ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా, లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా ఏపీ సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఆప్ పాలన వైఫల్యాలను గుర్తుచేశారు. ఆస్ప‌త్రుల నిర్వహణ, తాగునీరు సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భవిష్యత్ అభివృద్ధి కోసం ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సరైన మార్గమని అన్నారు.

ఏంటీ ద్వంద్వ వైఖ‌రి..
ఢిల్లీ సీఎం హోదాలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీకి వ‌చ్చిన అర‌వింద్ కేజ్రీవాల్‌.. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు. చంద్ర‌బాబు వ‌ల్లే రాష్ట్రం బాగుప‌డుతుంద‌ని, ఏపీ ప్ర‌జ‌లు టీడీపీకి ఓటు వేయాల‌ని కేజ్రీవాల్ కోరారు. 2019 ఏ పొత్తులేక ఒంట‌రైన బాబుకు కేజ్రీవాల్ మ‌ద్ద‌తిచ్చారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు సీఎం హోదాలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంపై ఆప్ అభ్యంత‌రం తెలుపుతోంది.

నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డిన కేజ్రీవాల్‌ను.. నేడు ఓడించాల‌ని చంద్ర‌బాబు పిలుపునివ్వ‌డం బాబు ద్వంద్వ రాజ‌కీయ సిద్ధాంతాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పొత్తులో ఉన్న పార్టీల‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోర‌డం త‌ప్పు కాదు కానీ, ఒంట‌రైన‌ప్పుడు స‌పోర్టు ఇచ్చిన వ్య‌క్తిపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని ఆప్ మ‌ద్ద‌తుదారులు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment