చంద్రగ్రహణం అనేది మనం చిన్నప్పుడు స్కూల్‌లో చదివిన ఒక ఆసక్తికరమైన ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడి కాంతిని చంద్రుడి మీదకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ విధంగా భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే కోణం ఆధారంగా సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
సంపూర్ణ చంద్రగ్రహణ విశేషాలు
సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 14న, హోలీ పండుగ రోజున ఏర్పడనుంది. ఈరోజున భూమి నీడ చంద్రుడిపై 99.1% వరకు కప్పివేస్తుంది. భారత కాలమానం ప్రకారం, ఈ గ్రహణం ఉదయం 9:29 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:39 గంటలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:29 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మొత్తం గ్రహణ దశ దాదాపు 6 గంటలపాటు కొనసాగుతుంది.
భారత్‌లో చంద్రగ్రహణం కనిపిస్తుందా?
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, పశ్చిమ ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. అయితే భారతదేశంలో గ్రహణ సమయానికి పగలు కావడం వల్ల ఇది కనిపించదు. ఐరోపాలో చంద్రుడు అస్తమించే సమయంలో గ్రహణం కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం ముగుస్తుంది.