కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో హింసించారని, భౌతికంగా దాడి చేశారని, ఆహారం కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అధికారుల ఒత్తిడితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయాల్సి వచ్చిందని ఆమె లేఖ ద్వారా వెల్లడించారు.
రన్యా రావు రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో ఈనెల 3న అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. కానీ, తనపై పెట్టిన కేసు తప్పుడు అని, అరెస్టు జరిగిన విధానం అన్యాయమని ఆమె వాదిస్తున్నారు.
“అరెస్టయినప్పటి నుంచి కోర్టుకు హాజరుపరిచే వరకూ నాపై నిరంతరం దాడి చేశారు. 10-15 సార్లు చెంపదెబ్బలు కొట్టారు. దుస్తులను మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. 50-60 తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారు. నేను నిరాకరించగానే మరింత హింసించారు” అని రన్యా రావు తన లేఖలో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. డీఆర్ఐ అధికారులపై విచారణ జరిపించాలని ఆమె కోరుతున్నారు.