SLBC టన్నెల్ ప్రమాదం గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, నిర్లక్ష్య ధోరణితో నిజాలను దాచిపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రభుత్వానికి అందిన రెండు నివేదికలు ముందుగానే ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించమని హెచ్చరించినప్పటికీ, వాటిని పక్కన పెట్టి కేవలం కమీషన్ల కోసమే పనులు కొనసాగించారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్లక్ష్య వైఖరితో కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి కుటుంబాలు చిన్నాభిన్నం
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అంతేకాకుండా, వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మొత్తం కేబినెట్ ఈ బాధ్యతను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైకోర్టు దర్యాప్తు డిమాండ్
SLBC ప్రమాదంపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలను ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.