తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధ (AI)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గణిత పాఠంలో భాగంగా ఏఐ పాఠాలను చేర్చనున్నారు. 1-5 తరగతుల వరకు 2-3 పేజీలు, 6-9 తరగతుల వరకు 4-5 పేజీలు ఈ పాఠ్యాంశం కవరేజ్‌గా ఉండనుంది.
SCERT సబ్జెక్టు నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ AI పాఠ్యాంశాలను సిద్ధం చేస్తోంది. కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుత వినియోగాలు, అనువర్తనాలు వంటి ఆసక్తికరమైన విషయాలను ఇందులో చేర్చనున్నారు. CBSEలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏఐ పాఠాలు ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు గుర్తించాలి.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల ముద్రణ ఇటీవల ప్రారంభమైనప్పటికీ, ఏఐ పాఠాల చేర్చే నిర్ణయంతో గణిత పుస్తకాల ముద్రణను తాత్కాలికంగా నిలిపివేశారు. SCERT అధికారులు పాత అంశాలను పరిశీలించి, కొత్త మార్పులు పూర్తి చేసిన తర్వాతే ముద్రణ తిరిగి ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం 22 లక్షల మందికి ఉచిత పుస్తకాలు సరఫరా చేస్తోంది. విద్యలో నాణ్యతను మెరుగుపరిచేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో AI టూల్స్, ప్లాట్‌ఫాంలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.