మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తమ వాదనలు వినిపించాయి.
మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కోర్టుకు రామోజీ రావు మరణించిన నేపథ్యంలో కేసును విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా ఇదే వాదనను న్యాయస్థానానికి సమర్పించింది. కాగా, మార్గదర్శి యాజమన్యాన్ని కేసు నుంచి బయటపడేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎత్తుగడలు వేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కేసు విచారణ చేపడితే కోర్టు సమయం వృథా అవుతుందనే కారణాన్ని తమ వాదనలో వినిపించాయి. డిపాజిటర్ల ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఈ కేసు విచారణ అనవసరం అని, ఒక వేళ ఫిర్యాదు చేసినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందన్న వాదనలను RBI ఖండించింది.
అయితే, మార్గదర్శి సంస్థ సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించిందని, విచారణ రామోజీ రావు జీవించి ఉన్నా, లేకపోయినా కొనసాగించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన అనంతరం, తదుపరి విచారణను హైకోర్టు మార్చి 7కి వాయిదా వేసింది.