గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగనున్నాయి. అయితే 905 గ్రూప్-2 పోస్టుల కోసం జరిగే ఈ పరీక్షల్లో అనేక వివాదాలు కొనసాగుతుండటంతో అభ్యర్థుల ఆందోళన మరింత ఉద్ధృతంగా మారింది.
పవన్ కళ్యాణ్ ఎక్కడ?
నిరసనలో పాల్గొన్న ఓ అభ్యర్థిని కన్నీటి పర్యంతమైంది. “గత ఎన్నికల్లో జనసేనకు ఓటేశాను.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?” అని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయం మీద స్పందించడం లేదని ఆమె నిలదీసింది. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరిచేయకముందు పరీక్షలు నిర్వహిస్తే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని విద్యార్థులు వాపోయారు. ఈ సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, APPSC చైర్మన్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. మా జీవితాలను నాశనం చేయకండి” అంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ నినాదాలు చేశారు. పరీక్షను వాయిదా వేసి, రోస్టర్ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.








