ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎదుర్కొన్న పరాజయం తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పంజాబ్‌లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు పరిస్థితిని, ఢిల్లీ ఎన్నిక ఫలితాల అనంతరం పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఆ పార్టీకి అత్యవసరమైంది. ఈ నేపథ్యంలో రేపు (మంగళవారం) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలో కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎదురైన విపత్తు, తద్వారా పంజాబ్‌లో ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు..
పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. “పంజాబ్‌లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు. వారు త్వరలో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు” అని ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ తమ వ్యూహాన్ని పదునుపెడుతోందని, రెండు పార్టీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.
ఫిబ్రవరి 8న వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు తీవ్ర షాక్ తగిలింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియా వంటి ప్రముఖ నేతలు పరాజయం పాలయ్యారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ వివాదం వంటి అంశాలు ఆప్ పరాజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.