మాజీ సీఎం ఆఫీస్‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు.. సీసీ కెమెరాల ఏర్పాటు

వైఎస్ జ‌గ‌న్ క్యాంపు ఆఫీస్ ఎదుట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇంటి స‌మీపంలో జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం స‌మీపంలోని గార్డెన్‌లో ఇటీవ‌ల ఒక్క‌రోజే చోట్ల అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు నిప్పుపెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. దీంతో వైఎస్ జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా, పోలీసులు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. వైఎస్ జగన్ నివాసం, పార్టీ ఆఫీస్ ఎదుట, క్యాంప్ ఆఫీస్ రోడ్డులో ఆదివారం సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ‌రుస ప‌రిణామాల‌తో మాజీ సీఎం భ‌ద్ర‌త‌ను స‌మీక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తుంది. రెండ్రోజుల క్రితం క్యాంపు ఆఫీస్ గార్డెన్‌లో అగ్నిప్రమాద ఘటనపై సీసీ టీవీ దృశ్యాలు ఇవ్వాలంటూ వైసీపీ ఆఫీస్ కు పోలీసుల నోటీసులు జారీ చేశారు. మంటలు ఎలా అంటుకున్నాయో గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోర‌డం గ‌మ‌నార్హం.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం మాజీ సీఎం జ‌గ‌న్ సెక్యూరిటీని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం భారీగా త‌గ్గించింది. జ‌గ‌న్ క్యాంపు ఆఫీస్ రోడ్డును ఓపెన్ చేసి అన్ని ర‌కాల వాహ‌నాల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. రెండు నెల‌ల క్రితం ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు వైసీపీ కార్యాల‌యంపై దాడికి య‌త్నించ‌గా, ఇటీవ‌ల మంత్రి లోకేశ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ క్యాంపు ఆఫీస్ ఎదుట బైకులు, కార్ల‌తో హంగామా చేసిన‌ వీడియో క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment