తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బార్గూర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు.
వెలుగులోకి వచ్చింది ఇలా..
బాలిక తరచుగా పాఠశాలకు రాకపోవడం గమనించిన ప్రధానోపాధ్యాయుడు ఆమె ఇంటికి వెళ్లి తల్లిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటికొచ్చింది. బాలిక గర్భవతి అని నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. పోలీసుల దర్యాప్తులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకోగా, ఒకరు ఇంటర్మీడియట్ చదివారు. చిన్నసామి (57) – బార్గూర్, ఆరుముగం (45) – మత్తూరు, ప్రకాష్ (37) – వేలంపాటి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిర్ధారణ అయ్యింది.
ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా విద్యాశాఖ వారు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలిక బంధువులు, గ్రామస్థులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘోర ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు భద్రతను పటిష్టం చేయాలని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







