ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి రహదారి ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
రైతు భూమిని లాక్కునే ప్రయత్నం
వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన మారేడు ప్రసాద్ అనే రైతుకు 1.06 సెంట్లు భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, టీడీపీ నాయకుడు వేములపల్లి రవి కిరణ్ తన పొలంలోకి రహదారిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. గతేడాది సర్వే చేసినప్పటికీ రవి కిరణ్‌కు ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేనట్లు తేలింది. అయినప్పటికీ, ప్రభుత్వం మారిన తర్వాత అధికార పార్టీ అండతో అతను మరోసారి రహదారి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు.
పోలీసుల సమక్షంలోనే, ప్రసాద్ భూమిలో ఉన్న మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి రహదారి వేయడం ప్రారంభించారు. దీనిని అడ్డుకోవడానికి వచ్చిన ప్రసాద్ తండ్రిపై రవి కిరణ్ అనుచరులు దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నించగా, ముళ్ల కంచెలోకి తోసివేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసుల మౌనం
ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనం పాటించారని గ్రామస్తుల తెలుపుతున్నారు. పంటను ధ్వంసం చేసే సమయంలో సీఐ, ఎస్ఐలు అక్కడే ఉన్నా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టులు ఉంటే, పోలీసులు ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోవద్దని నిబంధనలు చెబుతున్నా, వారే అక్రమాలకు తోడ్పాటు ఇస్తుండడం ఆశ్చర్యకరం. గ్రామస్థులు, బాధిత రైతు ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ ఘటనపై స్పందించి, టీడీపీ నేత దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.