రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, ప్రలోభపెట్టడం, భయపెట్టడం, దాడులకు తెగబడడం వంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై దాడులు చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన తిరుపతి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని, కార్పొరేటర్లు ప్రయాణించే బస్సుపై రాళ్లు రువ్వు అద్దాలు ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించారన్నారు.
ఆ గౌరవం ఏమైంది బాబూ..?
‘ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది, సంఖ్యాబలం లేనిచోట్ల మేం పోటీ చేయమూ’ అని గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడా గౌరవం ఏమైందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో మీకు సంఖ్యాబలం ఎక్కడ ఉంది? నిలదీశారు. హిందూపూర్‌లో వైసీపీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లారని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయన్నారు. సంఖ్యాబలం లేకపోయినా దాడులు, బెదిరింపులతో పదవులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేక నిన్న ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులపై దాడులు తీవ్రమయ్యాయని తక్షణమే ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడుతున్న టీడీపీ, జనసేన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.