సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గురువారం భారీగా 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు గంజాయ్ చాక్లెట్లను అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు స్టేషన్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు. దీంతో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ఈ వ్యవహారంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గోర్ సాహాను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ చాక్లెట్లను కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ టీ స్టాల్‌లో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీటిని సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్ల విలువ సుమారు రూ.2 లక్షలుగా అంచనా వేస్తున్నారు.








