తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి రేపటితో 420 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చింది 420 వంటి హామీలేనని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాటిని నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
రేపు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించిన అనంతరం వినతిపత్రాలు అందజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నిరసనల ద్వారా, ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై అవగాహన కలుగుతుందని ఆ పార్టీ ఆశిస్తోంది. హామీల అమలు కోసం ప్రజలకు మద్దతుగా చేపట్టే ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.