రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన మొక్కలను చిరంజీవి, వనజీవి రామయ్య దంపతులతో కలిసి సీఎం సందర్శించారు. ఈ పార్కులో 85 దేశాల నుంచి వివిధ రకాల మొక్కలు మరియు చెట్లు తీసుకొచ్చి నాటారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిలుకూరులో మంచి ఎకో టూరిజం పార్క్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందకరంగా ఉందని, ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా, టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం రంగాల అభివృద్ధికి కూడా దృఢంగా కృషిచేస్తోందని చెప్పారు. ఈ రంగాల అభివృద్ధి రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
టెంపుల్, ఎకో టూరిజానికి ప్రాధాన్యత
ఇప్పటికే తెలంగాణవాసులు దేవాలయ దర్శనాలు, అటవీ ప్రాంతాలు చూసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. కానీ, రామప్ప, వేయిస్తంభాల గుడి వంటి అపూర్వమైన ఆలయాలు, నల్లమల అడవులు, మల్లెల తీర్థం వంటి అందమైన ప్రకృతి ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పారు. టెంపుల్ టూరిజం మరియు ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు కొత్త అవకాశం కల్పించవచ్చన్నారు.
కొత్త టూరిజం పాలసీ ప్రణాళిక
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టూరిజం పాలసీని తీసుకురాబోతోందని, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ దిశగా ఎక్స్ పిరియం వంటి ఎకో టూరిజం పార్క్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇది త్వరలో రాష్ట్రానికి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
వికారాబాద్ ప్రాంతం ప్రత్యేకత
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ అటవీ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని, దానిని ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వనజీవి రామయ్య వంటి వారికి మనం ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటే విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామన్నారు.