తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) ప్రజలకు పదేళ్లపాటు సేవలు అందిస్తామని చెప్పారు. పదేళ్ల పాటు ఒక పార్టీకి అధికారం ఇస్తారనే సెంట్‌మెంట్ కొనసాగుతుందని రేవంత్ ధీమాతో తమ పార్టీ కూడా పదేళ్ల అధికారం అనుభవిస్తుందని వ్యాఖ్యానించారు.
1994 నుంచి 2004 వరకు ఒక పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు 2024 నుండి వచ్చే పదేళ్లపాటు తన పార్టీకి ప్రజలు అవకాశమిస్తారని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. నూతన విద్యా విధానాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరచడంపై దృష్టిపెట్టుతామని చెప్పారు. విద్యారంగానికి తగిన నిధుల కేటాయింపు, ఆధునిక సౌకర్యాల కల్పనలతో రాష్ట్రం విద్యలో ముందంజ వేస్తుందని ఆయన స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీపై గ్రామాలు, పట్టణాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇటీవల కాలంలో నిర్వహించిన గ్రామసభల ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడంపై బాధితులు రేవంత్ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. హామీల అమలు విషయంలోనూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపైగా గుర్రుగానే ఉన్నారు.