తైవాన్ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. యుజింగ్ జిల్లా (Yujing district) లో రాత్రి పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా 27 మంది తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం.
వరుస భూకంపాలు
సోమవారం రాత్రి తొలుత 5.1 తీవ్రతతో భూమి కంపించగా, దీని ప్రభావం తైనన్ నగరానికి 4 కి.మీ దూరంలో నమోదైంది. అనంతరం 4.8 తీవ్రతతో మరో భూకంపం చోటుచేసుకుంది. అయితే అర్ధరాత్రి తర్వాత 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో కొన్ని భవనాలు కూలిపోయాయి.
వైరల్ అవుతున్న వీడియోలు
భూకంపం ధాటికి ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూమి కంపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.