నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పలువురు నాయకులు, ఇది అసలు ప్రమాదమా లేక పసుపు నేతల పన్నాగమా అని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ నేతల తీవ్ర విమర్శలు
వైసీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. “మణితేజ మృతి రాజకీయ హత్య మాత్రమే. కోడి పందాల గొడవ పేరుతో టీడీపీ పన్నుకున్న కుట్ర ఇది. మణితేజ కుటుంబం పార్టీలో క్రియాశీలకంగా ఉండటం టీడీపీకి సహించలేకపోయింది. మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించాలి. హత్యకారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి” అని డిమాండ్ చేశారు.
నేతలపై విమర్శలు
జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై తీవ్రమైన విమర్శలు చేశారు. “పోలీసులను తమ కంట్రోల్‌లో ఉంచి, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు వేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.