ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని పోలీసులు పులివెందులలో అరెస్ట్ చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందితుడిగా ఆయనను చేర్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన రాఘవరెడ్డికి బెయిల్ తిరస్కరణ ఎదురుకావడంతో అరెస్ట్ జరిగింది. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించారని గత నెలలో హైకోర్టుకు నివేదించారు. “సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టలేదు, కులం పేరుతో ఎవరినీ దూషించలేదు. అయినా, పోలీసులు తప్పుడు వాంగ్మూలాలతో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అని రాఘవరెడ్డి ఆరోపించారు.
రాఘవరెడ్డి తరఫు వాదనలు
రాఘవరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారని, ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డి పై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని, ఈ వాంగ్మూలం ఆధారంగా రాఘవరెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. డిసెంబర్ 26న ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, నేడు తన తీర్పును వెల్లడించింది. కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో, పోలీసులు రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.