5 రోజులకే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి కేటీ జకారియా గుడ్‌బై!

5 రోజులకే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి కేటీ జకారియా గుడ్‌బై!

Summarize with AI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన కేటీ జకారియా వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అక్టోబర్ 10న ఆమె నియామకాన్ని ప్రకటించిన ట్రంప్.. కొద్ది రోజులకే ఆమె పదవి నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలను ఎదుర్కోవడంలో ఆమె తడబడ్డారంటూ విమర్శలు వచ్చాయి. కేవలం మూడు ప్రశ్నలకు సమాధానమిచ్చి, 14 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారనే కథనాలు ఆమె మీడియా నిర్వహణపై చర్చకు దారితీశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో కేటీ జకారియా సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ దయగల, మర్యాదపూర్వకమైన, కష్టపడి పనిచేసే నాయకుడని పేర్కొంటూ.. ఆయన కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. కేటీతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. పదవిలో కొనసాగాలా వద్దా అనే విషయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లు తెలిపారు. మీడియా ఆమెను అన్యాయంగా విమర్శిస్తోందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం కొద్ది గంటల్లోనే కేటీ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా, కేటీ జకారియా న్యాయ విద్యార్హతలపైనా వివాదం చెలరేగింది. పెప్పర్‌డైన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించిన ఆమె.. అమెరికాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అంగీకరించినట్లు ఏఎఫ్‌పీ నివేదించింది. గతంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో అధికార ప్రతినిధిగా పనిచేసిన కేటీ, అనంతరం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపులో చేరారు. తొలి మీడియా సమావేశంపై విమర్శలు, న్యాయ అర్హతలపై చర్చలు, చివరకు పదవి నుంచి నిష్క్రమణ.. ఈ పరిణామాలు అమెరికా రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment