హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ఆర్బిట్రేషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి కేసు విచారణ నుంచి తప్పుకోవాలంటూ హెచ్ఎండీఏ చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తిరస్కరించింది. గతంలో న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించినంత మాత్రాన ప్రస్తుత కేసులో పక్షపాతం ఉంటుందని భావించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి అభియోగాలు లేనప్పుడు పక్షపాతానికి తావెక్కడ ఉంటుందని హెచ్ఎండీఏను ప్రశ్నించింది.
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, ఓఆర్ఆర్ ఆర్బిట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్బిట్రేటర్ నియామకంతో పాటు వారికి చెల్లించాల్సిన ఫీజుల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏకు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. దీంతో ఆర్బిట్రేషన్ వ్యవహారంలో హెచ్ఎండీఏకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. నిర్దేశించిన గడువులోగా అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి, కేసును తదుపరి దశకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.








