మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందనే ఆరోపణలకు బలంచేకూర్చేలా మరో దారుణ ఉదంతం వెలుగుచూసింది. డ్యాన్స్ పోటీల కోసం అస్సాం నుంచి విశాఖపట్నం వచ్చిన 20 ఏళ్ల యువతి హిమశ్రీ బోరో అనుమానాస్పద రీతిలో శ్రీకాకుళంలో శవమై తేలడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, భయాందోళనలను రేకెత్తిస్తోంది.
అస్సాంలోని బొండా సమీపంలోని చపాయిడాంగ్ ప్రాంతానికి చెందిన హిమశ్రీ బోరో, ఒక డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి విశాఖ నగరంలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30న విశాఖపట్నం వచ్చింది. పోటీలు ముగిసిన తర్వాత స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఆమె రిజర్వేషన్ ఉన్న రైలును మిస్ చేసుకుంది.
దీంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో విశాఖ రైల్వే స్టేషన్‌లో కన్యాకుమారి-దిబ్రూగఢ్ (వివేక్ ఎక్స్‌ప్రెస్) రైలు ఎక్కింది. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న ఆమె స్నేహితుడు అభిషేక్ ఆమెను దింపేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించినప్పటికీ, విపరీతమైన రద్దీ ఉండటంతో అతడు దిగిపోయినట్లు సిసిటివి దృశ్యాలలో నమోదైంది.
“బోగీలో నేనొక్కదాన్నే అమ్మాయిని.. “
రైలు ఎక్కిన తర్వాత హిమశ్రీ తన స్నేహితులకు పంపిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు అత్యంత విషాదకరంగా, అనేక అనుమానాలకు తావిచ్చేలా మారింది. జనరల్ బోగీలో ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఉందని, కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేదని ఆ వీడియోలో ఆమె తీవ్రంగా భయపడుతూ చెప్పింది.
బోగీ మొత్తంలో తాను ఒక్కదాన్నే అమ్మాయిగా ఉన్నానని భయంతో వణికిపోతూ తన ఆవేదనను స్నేహితులకు పంచుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
శ్రీకాకుళంలో మృతదేహం లభ్యం!
బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని దూసి – పెనుబర్తి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌పై హిమశ్రీ బోరో మృతదేహం లభ్యమైంది. విశాఖపట్నం జిఆర్‌పి (GRP) ఇన్ స్పెక్టర్ డి.దీనబంధు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె ప్రయాణించిన రైలు బోగీలో రెండు లగేజ్ బ్యాగులు భద్రంగానే ఉన్నప్పటికీ, ఆమె మొబైల్ ఫోన్ మాత్రం కనిపించకుండా పోయింది.
రద్దీగా ఉన్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిందా లేక బోగీలో ఒక్కతే అమ్మాయి ఉండటాన్ని చూసి ఎవరైనా ఆకతాయిలు, అపపరిచితులు ఆమెపై దాడి చేసి కిందకు తోసేశారా? అనే కోణంలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
శాంతిభద్రతలకు కనీస ప్రాధాన్యం లేదు!
ఇతర రాష్ట్రం నుంచి కళారంగంలో రాణించడానికి ఏపీకి వచ్చిన ఒక యువతి.. చివరికి ఈ నేల మీద దారుణంగా శవమై తేలడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘోర ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








