రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 67 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత జూలై 18న ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు.
ఉదయ్ కృష్ణారెడ్డి తనను కొంతకాలంగా వేధిస్తున్నారని, వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపుల సందేశాలు పంపుతున్నారని, అకాడమీలోని తోటి స్నేహితుల ముందు తనపై తెలుగులో అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
నాటి నుంచి చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటున్న ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుమారు రెండు నెలలకు పైగా (67 రోజులు) జైలులో గడిపిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించినట్లయింది.








