హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లిం ఓట్లను పథకం ప్రకారం తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘానికి, బీజేపీకి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన ఒవైసీ.. SIR పేరుతో వెనుక తలుపు ద్వారా NRCని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఇదే సమయంలో తెలంగాణకు చెందిన తోలు వ్యాపారుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు. గత ఆరు నెలలుగా ఒడిశాలో తెలంగాణ నుంచి వెళ్తున్న తోలు ట్రక్కులను నిలిపివేస్తున్నారని, ఈ వ్యాపారంపై ఆధారపడి సుమారు 10 వేల మంది జీవిస్తున్నారని తెలిపారు. లారీలను అడ్డుకోకుండా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడాలని తెలంగాణ సీఎస్‌ను, ముఖ్యమంత్రి ఒడిశా సీఎంతో చర్చించాలని ఒవైసీ కోరారు.
మరోవైపు, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మాసాంతంలోగా ఎల్‌నినో ప్రభావం, పంట నష్టం, తాగునీటి ఎద్దడి తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలకు సూచించారు.








