హౌతీల దాడుల వేళ కీలక పరిణామం.. సౌదీకి బలగాల మోహరింపునకు పాక్, టర్కీ సిద్ధం

హౌతీల దాడుల వేళ కీలక పరిణామం.. సౌదీకి బలగాల మోహరింపునకు పాక్, టర్కీ సిద్ధం

Summarize with AI

మధ్యప్రాచ్యంలో హౌతీల దాడులతో (Houthis Attacks) ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సౌదీ అరేబియా(Saudi Arabia), పాకిస్థాన్(Pakistan), టర్కీ(Turkey) కీలక నిర్ణయం తీసుకున్నాయి. రియాద్‌లో జరిగిన మక్కా డిఫెన్స్ అలయన్స్‌(Mecca Defense Alliance) అత్యవసర సమావేశంలో సౌదీకి అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ చర్యతో మూడు దేశాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం ఆచరణాత్మక దశలోకి అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు.

హౌతీల నుంచి సౌదీపై కొనసాగుతున్న దాడులు, యెమెన్‌లో(Yemen) తాజా సైనిక పరిణామాల నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది. అయితే సౌదీలోకి ఎంతమంది సైనికులను పంపుతారు, ఎప్పుడు మోహరిస్తారు అనే వివరాలను మూడు దేశాలు వెల్లడించలేదు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ప్రకారం.. ప్రస్తుతం పాకిస్థాన్, టర్కీ బలగాలు సహాయక పాత్రలో ఉన్నాయి. పాకిస్థాన్ నిఘా, సమాచార సేకరణ కార్యకలాపాల్లోనూ సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మక్కా డిఫెన్స్ అలయన్స్‌ కింద ఒక దేశంపై సాయుధ దాడిని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి సమిష్టిగా స్పందించే విధానం ఏర్పాటైంది. ఆగస్టు 7న కుదిరిన ఈ ఒప్పందం సామూహిక నిరోధక శక్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. తాజా సమావేశంలో మక్కా, మదీనా సహా సౌదీలోని నగరాలు, పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలపై దాడులను మూడు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఇదే సమయంలో హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం (Yemeni government) పెద్ద ఎత్తున సైనిక చర్య చేపట్టింది. బాబ్ అల్-మందెబ్ జలసంధి (Bab al-Mandab Strait) సమీపంలో యెమెన్ ప్రభుత్వ బలగాలు కీలక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment