ఫార్ములా – ఈ రేస్‌లో ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్.. విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి, లాయర్లకు అనుమతి నిరాకరించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తరఫు లాయర్లకు అనుమతి ఇస్తేనే తాను విచారణకు వస్తానని భీష్మించుకొని కారులో కూర్చున్నారు. దీంతో 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎంతకీ పోలీసులు తన తరఫు లాయర్లకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. నేరుగా బీఆర్ఎస్ భవన్‌కు చేరుకున్నారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు రాజమౌళి కంటే మంచి కథలు రాస్తున్నారని సెటైర్లు వేశారు. విచారణకు లాయర్లను అనుమతించకూడదన్న నిబంధన చూపాలని పట్టుబట్టినప్పటికీ వారు చూపించలేకపోయారన్నారు. పోలీసులను తాను నమ్మనని, లాయర్ ఉంటేనే తన హక్కులకు పరిరక్షణ ఉంటుందన్నారు. తన లాయర్లతో వస్తే వాళ్లకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. రాతపూర్వకంగా తన స్టేట్మెంట్ ఏఎస్పీకి ఇచ్చానని కేటీఆర్ చెప్పారు. .








