ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల జీతాలు రేపటినుంచే వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇతర ఉద్యోగులకు జనవరి 1వ తేదీనే జీతాలు అందించగా, పింఛన్లను డిసెంబర్ 31న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యమవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జీతాల లేటు కారణంగా ప్రభుత్వం విమర్శల పాలు కావాల్సి వచ్చింది.
సంక్షేమ పథకాలు అమలు లేకపోయినా, నగదు బదిలీ కార్యక్రమాలు లేకపోయినా, కూటమి ప్రభుత్వం 5వ తేదీ వచ్చే వరకు వేతనాలు చెల్లించకపోవడంతో టీచర్ల కుటుంబాలు అసహనంతో ఉన్నాయి. జీతాల ఆలస్యంపై ప్రభుత్వంపై విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి. జీతాలు 1వ తేదీన అందించాలని అని పలువురు అభిప్రాయపడ్డారు.