‘నేను రాసింది ఒకటి.. తీసింది మరొకటి’.. ‘టాక్సిక్’ డైరెక్టర్‌పై ట్రోలింగ్

‘నేను రాసింది ఒకటి.. తీసింది మరొకటి’.. ‘టాక్సిక్’ డైరెక్టర్‌పై ట్రోలింగ్

Summarize with AI

సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఆ క్రెడిట్ ఎక్కువగా దర్శకుడికే (Director) దక్కుతుంది. ప్రస్తుతం ‘టాక్సిక్’(Toxic) విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. సినిమా డిజాస్టర్ టాక్(Disaster Talk) తెచ్చుకోవడంతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై (Geetu Mohandas) సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ‘టాక్సిక్’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో స్పష్టత లేదని, కథతో పాటు సరైన స్టోరీ లైన్ కూడా కనిపించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) మాట్లాడుతూ.. తాను రాసుకున్న స్క్రిప్ట్‌ను (Script) పూర్తిగా తెరకెక్కించలేదని, “నేను రాసింది ఒకటి.. తీసింది మరొకటి.. ఎడిటింగ్ చేసింది ఇంకొకటి.. మొత్తానికి సినిమా బయటకు వస్తోంది, నేను చాలా హ్యాపీ” అని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు స్క్రిప్ట్‌పై స్పష్టత లేని దర్శకురాలికి అవకాశం ఇస్తే సినిమా ఇలాగే ఉంటుందని కొందరు విమర్శిస్తున్నారు.

‘కేజీఎఫ్ 2’ వంటి భారీ విజయవంతమైన చిత్రం తర్వాత యష్ (Yash) తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దాదాపు రెండేళ్ల పాటు తదుపరి సినిమాను ప్రకటించకుండా గీతూ మోహన్ దాస్‌కు అవకాశం ఇవ్వడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సరైన కమర్షియల్ హిట్ లేని దర్శకురాలికి యష్ ఛాన్స్ ఇవ్వడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘టాక్సిక్’ ఫలితం ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమాలో యష్ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేదని, ఎక్కువగా మద్యం సేవించడం, ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం, కత్తి లేదా గన్‌తో హింసకు పాల్పడటం చుట్టూనే పాత్రను నడిపించారని విమర్శలు వస్తున్నాయి. 3 గంటల 14 నిమిషాల నిడివి కూడా ప్రేక్షకులకు భారంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక కథ(Story), పాత్రల (Character Design) రూపకల్పనలో లోపాలు ఉండటంతో నటీనటులకు (Actors) కూడా తమ ప్రతిభను చూపించే అవకాశం పెద్దగా దక్కలేదని నెటిజన్లు అంటున్నారు. సినిమాలోని పలువురు పాత్రలు భావోద్వేగాలు(Emotions), కోపంతో(Anger) గట్టిగా అరవడం తప్ప ప్రత్యేకంగా గుర్తుండిపోయే నటన కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కియారా అద్వానీ తన కెరీర్‌లో ‘టాక్సిక్’లోని పాత్ర అత్యుత్తమంగా నిలుస్తుందని, ఈ సినిమాకు ముందు.. తర్వాత అని తన కెరీర్‌ను చెప్పుకుంటారని ప్రీ రిలీజ్ సందర్భంగా పేర్కొన్నప్పటికీ, నదియా పాత్ర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే కామెంట్లు వస్తున్నాయి. దీంతో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘టాక్సిక్’పై సోషల్ మీడియాలో నెగెటివ్ చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment