హైదరాబాద్‌లోని (Hyderabad) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) (HYDRA) నిరుద్యోగ (Unemployed) యువతకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 150 ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్)(DRF) అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు (Driver Posts) పోటీ పడేవారు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు.
ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 4 మీటర్ల లాంగ్ జంప్(Long Jump), 7.2 కిలోల షాట్‌పుట్‌ను (Shot Put) 6 మీటర్ల దూరం విసరడం వంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో (Saroornagar Stadium, Hyderabad) జరిగే ఎంపిక ప్రక్రియకు నేరుగా హాజరుకావాలని అధికారులు సూచించారు.








