ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ దేశ రక్షణ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. రక్షణ మంత్రి ఫెదోరోవ్‌ను పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సైన్యాధ్యక్షుడితో నెలకొన్న విభేదాల నేపథ్యంలో తీసుకున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యాపై డ్రోన్ దాడుల వ్యూహంలో ఫెదోరోవ్ కీలక పాత్ర పోషించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను బాధ్యతల నుంచి తప్పించినట్లు సమాచారం. అనంతరం ఉక్రెయిన్ తాత్కాలిక రక్షణ మంత్రిగా యెన్హెన్ ఖ్మారాను నియమించినట్లు ప్రకటించారు.
ఫెదోరోవ్ తొలగింపును వ్యతిరేకిస్తూ కీవ్‌లో యువత ఆందోళనలు చేపట్టగా, ఆయనకు మద్దతుగా వాయుసేన డిప్యూటీ కమాండర్‌తో పాటు డ్రోన్ రక్షణ విభాగానికి చెందిన పలువురు నిపుణులు రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లో రక్షణ మంత్రి మార్పుపై రష్యా కూడా స్పందించింది. శాంతి చర్చలు సానుకూలంగా ముందుకు సాగాలంటే బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరమని పేర్కొంది. ఈ పరిణామాలు ఉక్రెయిన్ అంతర్గత రాజకీయాలు, రష్యాతో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.








