గోటితో పొయ్యేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు – బ‌న్నీ అరెస్టుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌

గోటితో పొయ్యేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు - బ‌న్నీ అరెస్టుపై ప‌వ‌న్ వ్యాఖ్య‌

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. నిర్మాత‌, తెలంగాణ ఫిల్మ్‌డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ దిల్‌రాజుతో భేటీ అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో చిట్ చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

`గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతిచెందిన త‌రువాత వెంట‌నే వాళ్ల ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించాలి. ఈ ఘ‌ట‌న‌లో మాన‌వ‌తా దృక్ప‌థం లోపించిన‌ట్లు అయ్యింది. అల్లు అర్జునే కాదు, టీమ్ అయినా సంతాపం తెల‌పాల్సింది. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్ప‌లేద‌ని అల్లు అర్జున్‌ను అరెస్టు చేశార‌న‌డం స‌రికాదు. రేవంత్ అలా ఆలోచించే నాయ‌కుడు కాదు.. చాలా బ‌ల‌మైన నేత. బ‌న్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు. పుష్ప బెనిఫిట్ షోల‌కు టికెట్ రేట్ పెంచ‌డం కూడా ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే.. సీఎం ప‌రిశ్ర‌మ అభివృద్ధికి రేవంత్ కృషిచేశారు.

అల్లు అర్జున్ విష‌యంలో ముందూ, వెన‌క ఏం జ‌రిగిందో నాకు పూర్తిగా తెలియ‌దు. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను తీవ్రంగా కలచి వేసింది. ఆ కుటుంబానికి సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయి. రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. అభిమానులకు అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకు క‌చ్చితంగా ఉంటుంది. ఈ వివాదంలో బ‌న్నీని ఒంటరి చేశారు. అల్లు అర్జున్‌ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్‌ కాదు అని ప‌వ‌న్ చెప్పారు.

నాగాబాబుకు మంత్రి ప‌ద‌విపై..
జ‌నసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, త‌న అన్న‌ నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. నాగబాబు రాజ్య‌స‌భ సీటును త్యాగం చేశార‌ని, మార్చిలో నాగ‌బాబు ఎమ్మెల్సీ అవుతారని, ఎమ్మెల్సీ అయ్యాకే మంత్రివ‌ర్గంలో చేరుతార‌న్నారు. త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన వారిని తానే చూసుకోవాలని, వార‌స‌త్వం అనాల్సిన ప‌నిలేదని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment