శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. బంధువుల ఆందోళన

శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. బంధువుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్ వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాలేజీలో చదువుతున్న అనంత‌పురానికి చెందిన య‌శ్వంత్ అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడు. స‌ద‌రు విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ గేటు వద్ద భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.

తమ బిడ్డ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, దీనికి కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. యాజమాన్యం సరైన సమాధానం చెప్పాలంటూ బాధితులు కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మరణించిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించిన విధానంపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, ఎవరినీ తోడు లేకుండా యాజమాన్యం అంత రహస్యంగా విద్యార్థిని ఆసుపత్రికి ఎలా తరలిస్తుందని వారు నిలదీశారు. ఏదో విషయాన్ని దాచడానికే కాలేజీ సిబ్బంది ఇలా ప్రవర్తించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని కాలేజీ ఎదుట బైఠాయించారు.

ఇదిలావుండగా, ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు బాధితుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి బంధువులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించి, గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యాయం చేయమని అడుగుతున్న తమపై పోలీసులు ఇలా లాఠీలు ఝుళిపించడం దుర్మార్గమని, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యానికి పోలీసులు కొమ్ముకాస్తూ తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment