ఈ ఏడాది ప్రారంభంలో చిరంజీవి(Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) భారీ విజయాన్ని అందుకోవడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే జోష్‌లో దర్శకుడు బాబీ (Bobby) తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను కూడా మెగాస్టార్ వేగంగా ప్రారంభించారు. ఇటీవల గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, చాలా కాలంగా చర్చల్లో ఉన్న ‘విశ్వంభర’ (Vishwambhara) మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ లేకుండానే నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు భారీ అంచనాలు నెలకొన్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పుడు అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
వశిష్ట (Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తోంది. అయితే VFX పనులు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడుతోందని టాక్ వినిపిస్తున్నప్పటికీ, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రచారం జరిగినా, ఇప్పటివరకు రిలీజ్ డేట్, టీజర్ లేదా సాంగ్స్‌పై కనీస సమాచారం కూడా లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో ‘విశ్వంభర’పై ఉన్న బజ్ క్రమంగా తగ్గిపోతుందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.








