పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. లోకేష్ సెల్ఫీలతో నెటిజన్ల ట్రోలింగ్

పెట్రోల్ ధరల్లో ఏపీ టాప్.. లోకేష్ సెల్ఫీలతో నెటిజన్ల ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇంధన ధరల జాబితా తాజాగా విడుదలవగా.. అందులో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.113.03కు చేరడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈ ధరల పెరుగుదలపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌పై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

నాడు సెల్ఫీ ఛాలెంజ్‌లు.. నేడు ధరల మోత!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ నారా లోకేష్ పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలు దిగి మరీ అప్పటి సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఇంధన ధరలను భారీగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ధరలు తగ్గకపోగా, రెండేళ్లలో ఏకంగా లీటరుకు రూ.10 పైనే పెరగడం గమనార్హం. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో రూ.3 పెంచడంతో ఏపీలో రేట్లు ఆకాశాన్ని తాకాయి.

“మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం లోకేష్ అన్నా?”
గతంలో ఏపీలో పెట్రోల్ రేటు రూ.103 ఉన్నప్పుడు.. లోకేష్ స్పందిస్తూ, “ఏపీలో రేట్లు ఎక్కువగా ఉన్నాయి.. అందుకే నేను పక్కనే ఉన్న తెలంగాణకు వెళ్లి నా వాహనం ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను” అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు గట్టిగా రీ-పోస్ట్ చేస్తున్నారు. “నాడు రూ.103 ఉంటేనే పక్క రాష్ట్రానికి వెళ్లావు.. మరి ఇప్పుడు మీ పాలనలో రూ.113 దాటింది, ఇప్పుడు వాహనదారులు ఏ రాష్ట్రానికి వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి లోకేష్ అన్నా?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారంటూ యువత సైతం మండిపడుతోంది.

వైసీపీ ప్రశ్నల వర్షం.. “చేతకావడం లేదా?”
ఈ అంశంపై ప్రతిపక్ష వైసీపీ సైతం కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తోంది. “దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? నాడు ఎన్నికల ప్రచారంలో మాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. అట్లకాడ తిప్పినట్టు రాజకీయం చేస్తామన్నారు.. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఇంధన ధరలను నియంత్రించడం మీకు చేతకావడం లేదా?” అంటూ చంద్రబాబు, లోకేష్‌లను వైసీపీ నిలదీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment