ఆన్‌లైన్ మూవీ పైరసీ (Online Movie Piracy) ప్రపంచంలో సంచలనం సృష్టించిన IBOMMA… పోలీస్ అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ మరోసారి వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు పూర్తిగా కనిపించకుండా పోయిన IBOMMA వెబ్‌సైట్ ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, తాజా సినిమాలు కూడా అందుబాటులో కనిపించడం సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పుడు మళ్లీ యాక్టివ్!
IBOMMAను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిని(Ravi) ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను కూడా నిలిపివేశారు. అతని బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ చేశారు. దీంతో ఇకపై ఈ సైట్ పూర్తిగా మూతపడిందని చాలామంది భావించారు. కొన్నాళ్ల జైలు జీవితం తరువాత అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు కఠినమైన షరతులు విధించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా అదే పేరుతో సైట్ మళ్లీ యాక్టివ్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పుడు కొత్త సినిమాలు అందుబాటులోకి రావడంతో, ఇది నిజంగా అదే నెట్‌వర్క్ నిర్వహిస్తున్నదా? లేక మరెవరైనా తిరిగి ప్రారంభించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీలో కలకలం
తాజాగా జరిగిన ఈ పరిణామం టాలీవుడ్‌తో పాటు మొత్తం సినీ పరిశ్రమలో(Film Industry) కలకలం రేపుతోంది. పైరసీ కారణంగా ఇప్పటికే భారీ నష్టాలు ఎదుర్కొంటున్న నిర్మాతలు(Producers), డిస్ట్రిబ్యూటర్లు(Distributors) ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు. మరోవైపు, పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారు? మళ్లీ చర్యలు తీసుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది.








