ఫార్ములా ఈ – కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 20న ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలిచ్చిన హైకోర్టు, ఆ ఉత్తర్వులను డిసెంబర్ 31 పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరగా, ఆ గడువును మరొక రోజుకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
ఏసీబీ కౌంటర్ పై వాదనలు
ఈ కేసులో ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ, ఏసీబీ మరో పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఆయనకు మధ్యంతర బెయిల్ కొనసాగితే విచారణకు ఆటంకం కలుగుతుందని ఏసీబీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈనెల 31న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.