పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ అండగా నిలిచింది. పుష్ప మూవీ టీమ్ పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ మరో రూ.50 లక్షలు మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం చెక్కులను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజుకు అందజేశారు.
తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, బాలుడు త్వరగానే కోలుకుంటున్నాడని తెలిపారు. అలాగే రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
బాలుడు శ్రీతేజ్ స్పీడ్‌గా రికవర్ అవుతున్నాడని, 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా చికిత్స అందుకుంటున్నాడని నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. రేపు ఉదయం సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలసి సీఎం రేవంత్‌తో భేటీ అవుతున్నట్లు వివరించారు.