ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ తనను హత్య చేయాలని పలు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎంపై కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ తనను రాజకీయంగా వాడుకొని వదిలేశాడని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో తాను కూడా సాయం చేశానని చెప్పారు. కానీ, ఆయన తనను వాడుకుని వదిలేశాడని వ్యాఖ్యానించారు. 58 సార్లు తన ప్రెస్ మీట్స్‌ను అడ్డుకున్నారని, తనపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు.
ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేత
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ (రేవంత్‌రెడ్డి) ట్యాక్స్ వసూళ్ల దందా నడుస్తోందని కేఏ పాల్ ఆరోపించారు. సినీ హీరో నాగార్జున ఫంక్షన్ హాలును కూల్చివేశారు కానీ, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఇంటిని కూల్చకుండా కాపాడుకున్నారన్నారు. కేఏ పాల్ చేసిన ఆరోపణలపై అధికార పక్షం నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.