ఉగాది పండుగ ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా..?

ఉగాది పండుగ ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా..?

తెలుగువారి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, నూతన సంవత్సరానికి నాంది పలికేది ‘ఉగాది’. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులకు, కొత్త చిగురులకు ప్రతీక. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్న అస‌లు క‌థ‌ ఏమిటో తెలుసుకుందాం.

ఉగాది అంటే ఏమిటి?
‘ఉగాది’ అనే పదం ‘యుగ’ మరియు ‘ఆది’ అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. ‘యుగ’ అంటే కాలం, ‘ఆది’ అంటే మొదలు. అంటే ‘ప్రపంచ కాల గమనం మొదలైన రోజు’ అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు ఈ రోజే సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. అందుకే దీనిని ‘యుగాది’ లేదా ‘ఉగాది’ అని పిలుస్తారు.

బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే సృష్టిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. కాలగణన కూడా ఈ రోజు నుండే మొదలైంది. శీతాకాలం ముగిసి, చెట్లు చిగుర్చి, కోకిలమ్మల‌ రాగాలతో ప్రకృతి సరికొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మార్పును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగ ఇది. శాలివాహన చక్రవర్తి పట్టాభిషేకం ఈ రోజే జరిగిందని, అప్పటి నుండి శాలివాహన శకం ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది.

ఉగాది పండుగ విశేషాలు
ఉగాది అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల కలయికతో దీన్ని తయారు చేస్తారు. జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి మనకు సందేశాన్నిస్తుంది. ఉగాది నాడు కొత్త పంచాంగాన్ని చదువుతారు. ఆ ఏడాదిలో వర్షాలు ఎలా ఉంటాయి? ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? రాశి ఫలాలు ఏమిటి? వంటి విషయాలను తెలుసుకోవడం ఒక సంప్రదాయం వ‌స్తోంది.

తెలుగు సాహితీ ప్రియులు ఈ రోజున కవి సమ్మేళనాలు నిర్వహించి, తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెబుతారు. ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన సంస్కృతికి, ఆచారాలకు నిలువుటద్దం. కొత్త ఆశలతో, కొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుంది.
అంద‌రికీ ఉగాది పండుగు శుభాకాంక్ష‌లు

Join WhatsApp

Join Now

Leave a Comment