జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ ఇచ్చింది. కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
ఓ టీవీ ఛానల్ ప్రతినిధిపై మోహన్‌బాబు దాడిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ, మోహన్ బాబు కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయన విదేశాలకు వెళ్లిపోయారన్న ప్రచారం జరిగినప్పటికీ, ఆయన తరపున లాయర్లు స్పందించి మోహన్ బాబు ఎక్కడికి వెళ్లలేదని స్పష్టం చేశారు.
ఆస్తి తగాదాలు, దాడి కేసు చుట్టూ వివాదాలు
జల్‌పల్లి నివాసంలో మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణు మధ్య జరిగిన కుటుంబ విభేదాల సమయంలో న్యూస్ కవరేజ్‌కు వచ్చిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో జర్నలిస్టు రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా, విచారణకు హాజరుకాకపోవడం మోహన్ బాబుకు న్యాయపరమైన సమస్యలు మరింత తీవ్రమయ్యేలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.