భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ఉతప్ప, సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టరుగా ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాల నుండి రూ.23 లక్షలను కట్ చేసి, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPFO) లో జమ చేయకపోవడం పెద్ద వివాదంగా మారింది.
ఈ వ్యవహారంపై కర్ణాటక పీఎఫ్ రీజనల్ కమిషనర్ అతడికి నోటీసులు జారీ చేశారు. వాటిని అందజేసేందుకు డిసెంబరు 4న పులకేశినగర్‌లోని ఉతప్ప నివాసానికి వెళ్లారు. ఇంట్లో అతను లేకపోవడంతో ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్ రీజనల్ కమిషనర్ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు నేషనల్ మీడియా తెలుపుతోంది.
ఈ క్రమంలోనే ఉతప్పపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. డిసెంబరు 27లోగా అతడు బకాయిలు చెల్లించాలని లేదంటే అరెస్టు తప్పదని వారెంట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.