మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల టీడీపీ శ్రేణుల దాడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసం ధ్వంసమవడంతో పాటు, పెట్రోల్ బాంబులు విసరడంతో ఇంట్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో శుక్రవారం వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లి జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి జరిగిన ఇంటిని పరిశీలించి, పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న అక్కసుతోనే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయించడం దుర్మార్గమైన రాజకీయమని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలను సీబీఐ పూర్తిగా ఖండించిందని జగన్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తేలిపోయిందన్నారు. అయినప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేపల నూనె కలిసిందంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వీరిని తప్ప ఇంకెవరూ కల్తీ జరిగిందని చెప్పలేదన్నారు.
సీబీఐ నివేదిక వచ్చిన తర్వాతైనా చంద్రబాబు తిరుమల స్వామివారి ఎదుట క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డికి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయినా అబద్ధాలు ప్రచారం చేస్తూ చంద్రబాబు ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శించారు.
సీబీఐ తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదన్న అసహనంతోనే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని జగన్ ఆరోపించారు. సుప్రీంకోర్టుకంటే చంద్రబాబు గొప్పవాడా? అంటూ ప్రశ్నించారు. ఎలాగైనా తన అబద్ధాలను నిజంగా చూపించాలనే ఆత్రుతతోనే ఈ కమిషన్ నాటకమని వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలపై దాడులు చేసిన టీడీపీ గుండాలు, వారికి సహకరించిన పోలీసులపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని జగన్ హెచ్చరించారు. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ, తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదని స్పష్టం చేశారు.








