బీజేపీ (BJP) రాజకీయాల్లో సంచలన ఘట్టం చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (Nitin Nabin) (45) ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు హాజరై నితిన్ నబిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్లకే జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బీజేపీకి కొత్త దిశను సూచిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నితిన్ నబిన్..
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్ నబిన్‌కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆర్ఎస్ఎస్(RSS) నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది. యువ నాయకత్వంతో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.







