బన్నీ బిజీ.. పుష్ప-3 ది ర్యాంపేజ్ వర్క్ స్టార్ట్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప, పుష్ప 2 సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంచైజ్‌తో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగగా, పుష్ప 2 అయితే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అదే సినిమాతో రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా స్టార్ హీరోయిన్‌గా మరింత బలమైన గుర్తింపు తెచ్చుకుంది.

సందేహాలకు ముగింపు..
పుష్ప 2 క్లైమాక్స్‌లోనే పుష్ప 3కి సంబంధించిన హింట్ ఇవ్వడంతో, ఈ మూడో భాగం నిజంగానే ఉంటుందా లేదా కేవలం హైప్ కోసమేనా అనే చర్చలు మొదలయ్యాయి. కొందరు పార్ట్ 3 ఉండదని ప్రచారం చేయగా, ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ దుబాయ్‌లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ (SIIMA 2025 Awards) కార్యక్రమంలో సుకుమార్ స్పష్టంగా స్పందించారు. పుష్ప 3 తప్పకుండా ఉంటుందని ఆయన కన్ఫామ్ చేశారు. అయితే రిలీజ్ టైమ్‌లైన్ మాత్రం వెల్లడించలేదు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ (Atlee), లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) లాంటి స్టార్ డైరెక్టర్లతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు సుకుమార్ కూడా రామ్ చరణ్ (Ram Charan) కోసం ఒక కథను రెడీ చేస్తున్నాడని సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్
ఇటీవల సుకుమార్ టీమ్ నుంచి వస్తున్న అప్‌డేట్ ప్రకారం, పుష్ప 3: ది ర్యాంపేజ్ (Pushpa 3: The Rampage) స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయట. హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ తీసుకుని, బన్నీ – సుకుమార్ ఇద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్ట్స్ మధ్య గ్యాప్ సమయంలో కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? రిలీజ్ ఎప్పుడుంటుంది? అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. పుష్ప అభిమానులకు మాత్రం ఇప్పుడు ఒకటే మాట – వెయిట్ అండ్ వాచ్.

Join WhatsApp

Join Now

Leave a Comment